Sri Bhagavadgeetha Madanam-1    Chapters   

6. కర్మయోగము

కర్మఅనగానేమి?

విశాల దృక్పథముతో నిర్వచించినచో భూతములకు అస్తిత్వము కలుగజేయు సృష్టి వ్యాపారమే కర్మ యగును.

శ్లో|| భూత భవోద్భవ కరో విసర్గః కర్మ సంజ్ఞితః

గీత 8-3

అనగా కర్మను సృజనాత్మకకార్యము లేక నిర్మాణాత్మకకార్యము అనవచ్చును. సృష్టి నిర్మాణాత్మకకార్యమే భగవంతుడు చేసిన కర్మ. అతని అధీనమునగల మాయ సత్వ రజస్త మోగుణములచేత త్రిగుణా త్మకమును నామరూపాత్మకమును అగు ప్రపంచమును సృష్టించినది. కర్మ , నామరూపములు, మాయ అనునవి సమానార్థకము లనవచ్చును.

ఈ సృష్టికి భగవంతుడు సాక్షిమాత్రేమే. అయినను అతని అధ్యక్షతచేతనే సృష్టించుచున్నది.

శ్లో|| మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే స చరాచరమ్‌

హేతు నానేన కౌన్తేయ జగద్విపరివర్తతే ||

గీత 9-10

నా అధ్యక్షతచేతనే ప్రకృతి చరాచరములగు సమస్త భూతము లను పుట్టించు చున్నది.

శ్లో|| #9; ఏకోదేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంత

రాత్మ

కర్మాధ్యక్షః సర్వభూతాధి వాసః సాక్షీ చేతా కేవలో నిర్గుణశ్చ

-శ్వేతశ్వతతము

భగవంతుడు తాను సాక్షి మాత్రమగు కారణము చేతనే సృష్టి జరుపబడుచున్నది.

భగవంతుడు ఎందులకు సృష్టి యొనర్చె? ననుటకు సరియైన సమాధానము లభింపదు. అతి ప్రాచీనమైన ఋగ్వేదీయ నాసదీయ సూక్తమునగూడ ఈ ప్రశ్నకు సమాధనము లేదు. ఈ సృష్టి ఏర్పడుటకుఆరంభ, పరిణామ, నివర్త అజాతవాదములు చెప్పబడినవి. భక్తి యోగమునందు భగవంతు డేల సృష్టించెననుటకు భాగవత సమాధానమును వ్రాసితిని.

కర్మల వర్గీకరణము ! మానవు డొ నరించవలసిన కర్మ:

పండితులుకూడ మానవు డొనర్చవలసిన కర్మ ఎట్టిదో తెలిపి కొన జాలకున్నారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో 4వ అధ్యాయమున ఎట్టి కర్మ నాచరించి మానవుడు సంసార బంధమునుండి విముక్తి గాంచునో వివరించియున్నాడు.

శ్లో|| కింకర్మ కిమకర్మేతి కవయో7ప్యత్ర మోహితాః

తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే7శుభాత్‌ ||

గీత 4-16

కర్మ ఏదో అకర్మ ఏదో పండితులు కూడ తెలిసికొనజాలరు. కర్మను గూర్చి తెలిసికొన్న ఎడలసంసారబంధమునుండి విముక్తుడ వగుదవు.

శ్లో|| కర్మణ్యో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యంచ వికర్మణః

ఆకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః

గీత 14-17

కర్మను గురించి వికర్మను గురించి ఆకర్మనుగురించి తెలిసికొన వలయును. కర్మమార్గము దురవగాహమైనది. కేవల శారీరక కర్మలు భోగానంతరము వదలును. అహంకారముతో కామముతో చేయబడిన కర్మలు బంధహేతువులగును.

కర్మ

1) కర్మ 2) వికర్మ 3) అకర్మ

కర్మ

సత్‌కర్మ యజ్ఞ దాన తపఃకర్మలు శ్రధ్ధతో చేయుట

అసత్‌కర్మ యజ్ఞ దాన తపః కర్మలు అశ్రద్ధతో చేయుట

వికర్మ- వేదనిషిద్ధకర్మలు లేక సోమరితనంతో కర్మ చేయకుండుట

అకర్మ- నిస్వార్ధబుద్ధితో చేయు యజ్ఞ దాన తపః కర్మలు

కర్తవ్యములు

1 శ్రుతి ప్రోక్తములు

వైదిక

యజ్ఞయాగాది

కర్మలు

2 స్మృతి ప్రోక్తములు

వర్ణాశ్రమ కర్మలు

3 పౌరాణికధార్మికములు

వ్రతములు ఉపవాసములు

స్మార్తక

నిత్యములు సంధ్యావందనము

నైమిత్తికము గ్రహశాంతి

కామ్యములు పుత్రప్రాప్తి

నిషిద్ధములు సురాపానము

1) కర్మ :-

కర్మరెండు విధములు. ఎ) సత్కర్మ. బి) అసత్కర్మ. కర్తృత్వభావనతో చేసినప్పుడే యిని కర్మలగును.

ఎ) సత్కర్మ:- వేదోక్తములైన యజ్ఞయాగాదులు, నిత్యనైమిత్తిక కామ్యకర్మలు, వర్ణాశ్రమ ధర్మానుసార కర్మలు మొదలగు కర్మలను శ్రద్ధతో చేసిన అవి సత్కర్మలనబడును.

బి) అసత్కర్మ:- పై కర్మలను అశ్రద్ధతో జేసిన అసత్‌కర్మలనబడును.

గుణభేదము ననుసరించి కర్మవిభాగమునకై వర్ణ విభజన :-

శ్లో|| #9; చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః

తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తార మవ్యయమ్‌ ||

గీత 4-13

సత్వరజస్తమో గుణభేదముల ననుసరించి నాచే కర్మ విభాగమునకై బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులను నాలుగు వర్ణములు సృష్టింపబడెను. వానికి నేను కర్తనైనను మాయకు వశుడను గాక పోవుటచేత నాకట్టి కర్తృత్వము లేదు. అనగా వర్ణాశ్రమ ధర్మములను బట్టి వారి ధర్మములు లేదా కర్తవ్యము లేర్పడెను.

భాగవతమున చాతుర్వర్ణ్య కర్మలు క్రింది విధముగా చెప్పబడినవి.

క|| దమమును శౌచము దపమును

శమమును మార్దవము గృపయు సత్యజ్ఞాన

క్షమలును హరిభక్తియుహ

ర్షము, నిజలక్షణము లగ్రజాతికి నధిపా.

ఉ|| శౌర్యము దానశీలము, ప్రసాదము నాత్మజయంబు దేజమున్‌

ధైర్యము, దేవభక్తియును, ధర్మము, నర్థము, గామమున్‌, బుధా

చార్య ముకుంద సేవలును, సత్కృతియున్‌, బరితోషణంబు

ద్వీర్యము, రక్షణంబు, బృధివీవర శేఖరః రాజ చిహ్నముల్‌.

క|| ధర్మార్ధ కామ వాంఛయు

నిర్మల గురుదేవ విప్ర నివహర్చనముల్‌

నిర్మదభావము బ్రమదము

శర్మకరత్వమును వైశ్యజన లక్షణముల్‌.

ఉ|| న్తేయములేని వృత్తియు శుచిత్వము సన్నుతియున్‌ విజేశులన్‌

మాయలులేక డాయుటయు మంత్రమునెప్సక పంచయజ్ఞముల్‌

సేయుటయున్‌ ధరామరుల సేవము గోవుల రక్షణంబు, న

న్యాయము లేమియున్‌ మనుజనాధః ఎఱుంగుము శూద్రధర్మముల్‌

భాగవతము 7-412-413,414,415.

కాని జాతిమాత్రముచేతనే వర్ణనిర్దేశము చేయరాదనియు శమదమాది గుణములనుబట్టి నిర్ఱయింపవలెననియు నారదుడు తెలిపెను.

''జాతి మాత్రంబున బురుషునకు వర్ణంబు నిర్దేశింపబనిలేదు. శమదమాది వర్ఱలక్షణ వ్యవహారంబులు గనవలయునని'' నారదుడు వచించెను.

సాత్విక రాజసిక తామసిక కర్మలు:-

శ్లో|| అనుబంధం క్షయం హింసా మనపేక్ష్యచ పౌరుషమ్‌

మోహదారభ్యతే కర్మ లత్తామస ముదాహృతమ్‌.

గీత 18-25

ముందు రాబోవు మంచిచెడ్డలను. నాశమును, హింసను తన సామర్థ్యమును ఆలోచింపక మోహమువలన ప్రారంభింపబడు కర్మకు తామస కర్మయని చెప్పబడుచున్నది.

శ్లో|| యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణవా పునః

క్రియతే బహుళా యానం తద్రాజస ముదాహృతమ్‌||

గీత 18-24

ఎవడు కోరికలు కలిగి అహంకారముతో గూడికొని మిగుల కష్టమునిచ్చు కర్మను చేయుచున్నాడో అట్టివాడు చేయు కర్మ రాజన మని చెప్పబడును.

శ్లో|| నియతం సంగ రహిత మరాగ ద్వేషత కృతమ్‌

అఫల ప్రేప్సునా యత్త త్సాత్విక ముచ్యతే

గీత 18-23

తనకు విధించబడియుండు కార్యమును, తాను కర్తయను అభిమానములేకను, దాగద్వేషములులేకను నియయముచేత స్వధర్మాను సారముగా చేయబడు కర్మ సాత్విక కర్మ యనబడును.

శ్లో|| ముక్త సంగో7నహం వాదీ ధృత్యుత్సాహ సమన్వితః

సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే

గీత 18-26

ఫలాపేక్షలేక తాను కర్తయను అభిమానములేక కార్యము సిద్ధించినను సిద్ధించక పోయినను మనస్సున వికారము జెందక సమబుద్ధి గల వాడై ధైర్యోత్సాహముల వదలక పని చేయువాడు సాత్విక కర్త యనబడును.

యజ్ఞ దాన తపః కర్మల స్వరూపము (సదసత్‌ కర్మలు):-

భగవద్గీతలో శ్రీకృష్ణుడు యజ్ఞదాన తపః కర్మలను వదలకూడదని బోధించెను. ఆకర్మలపైగల సామాన్య అభిప్రాయములను మార్చి వాని నిజస్వరూపమును వివరించెను.

శ్లో|| యజ్ఞ దాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్‌

యజ్ఞోదాన తపః శ్చైవ పావనాని మనీషిణః ||

----గీత

యజ్ఞదాన తపః కర్మలు వదలకూడదు. అవి చేయదగినవి. ఈ కర్మలు పండితులకు చిత్తశుద్ధి కలిగించును.

గీ|| కర్మ భక్తులలోడను క్రమముతోడ

చిత్త విశ్రాంతి నొందును శీఘ్రమందె

కావునను కర్మ భక్తులు జీవునకును

సేయవలసిన కార్యంబు సిద్ధమయ్యె.

----- రామస్తవరాజము

అని రామస్తవరాజముకూడ కర్మ ఆవశ్యకతను బలపరచినది. అయినచో మన మాచరించవలసినినది సత్కర్మ.

శ్లో|| సద్భావే సాధుభావేచ సది త్యేత త్ప్రముచ్యతే

ప్రశ##స్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్ధః యుజ్యతే.

గీత 17-26

సద్భావమునందు సాధుభావమునందును సత్‌ అను పదమునుపమోగింపబడును. మంగళకరమగు కర్మమునందు సత్‌ అను పదము ప్రయోగింపబడును.

శ్లో|| యజ్ఞే తపసి దానేచ స్థితి స్సదితి చోచ్యతే

కర్మచైవ తదర్థీయం, సదిత్యేవాభి ధీయతే

గీత 17-29

యజ్ఞ దాన తపః కర్మలయందుండు స్థితిని సత్‌ అందురు. అయ్యది నెరవేర్చుటకు చేయు కర్మముకూడ సత్తనియే చెప్పబడును. ఈ కర్మలను శ్రద్ధతో చేయవలయును.

శ్లో|| అశ్రద్ధ యా హుతం దత్తం స్తప్తం కృతంచ యత్‌

అస దిత్యుచ్యతే పార్థః నచతత్ప్రేత్య ఇహ

గీత 17-28

అశ్రద్ధతో చేయబడిన హోమము దానము తపస్సు కర్మము ఇది అసత్తని చెప్పబడును. ఇవి ఇహమందును పరమందును సుఖకరములు కావు. కాన కర్మలను శ్రద్ధతో చేయవలెను.

యజ్ఞ దాన తపః కర్మలు కూడ ఒక్కొక్కటి యూడు విధములుగ విభజింపబడినవి. అవి సాత్విక రాజసిక తామసికమలు.

యజ్ఞము

1.తామసిక యజ్ఞము 2.రాజసిక యజ్ఞము #9; 3.సాత్విక యజ్ఞము

సాత్విక యజ్ఞము :-

శ్లో|| #9; అఫలా కాంక్షిభి ర్యజ్ఞో విధి దృష్టోయ ఇజ్యతే

యష్టవ్య మేవేతి మసః సమాధాయ స సాత్వికః

గీత 17-11

యజ్ఞము చేయుటయే విధియని మనస్సును సమాధానపరచుకొని ఫలాపేక్షలేక చేయునట్టి శాస్త్ర సమ్మతమైన యజ్ఞము సాత్వికయజ్ఞమనబడును. యజ్ఞముచేయుట స్వధర్మము గనుక చేయవలెను. దాని వలన ప్రతిఫలమును కోరరాదు.

రాజసిక యజ్ఞము :-

శ్లో|| #9; అభి సంధాయతు ఫలం దమ్భార్థ మపిచైవ యత్‌

ఇజ్యతే భరతశ్రేష్ఠః తం యజ్ఞం విద్ధి రాజసమ్‌

గీత 17-12

ఫలముగోరి కాని డాంబికమునకు గాని చేయునట్టి యజ్ఞము రాజస యజ్ఞమని తెలియుము.

ఇట్టి రాజస యజ్ఞ ఫలము కర్తను బొందును. ఆ ఫలము ననుభవించిన తరువాత అది నశించును. దాని వలన కలిగిన స్వర్గాది భోగములు నశించును. ఇట్టికర్మలో స్వార్థబుద్ధి ఎక్కువ.

తామస యజ్ఞము :-

శ్లో|| విధి హీన మసృష్టాన్నం మంత్రహీన మదక్షిణమ్‌

శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్ష్యనే

గీత 17-13

అన్నదానము లేక తగిన దక్షిణల నియ్యక అశాస్త్రీయముగను, మంత్రలోపముతోను, శ్రద్ధలేకను చేయునది తామసయజ్ఞము.

యజ్ఞస్వరూపమును మనము సరిగా గ్రహించవలెను. భారత, భాగవత, భగవద్గీతల అభిప్రాయము పరిశీలింతము.

భారతమున అశ్వమేధపర్వమున చెప్పబడిన ఒక కథలో యజ్ఞ మనగా వేదముననున్న వీమాంసకులచే శ్లాఘింపబడు యజ్ఞయాగాది క్రతువులు మాత్రమే కాదని తెలుపబడినది. దరిత్రుడు కూడ అట్టి యజ్ఞము చేయజాలక పోయినను ఇతర యజ్ఞములవలన అట్టి ఫలితమును పొందవచ్చును.

పూర్వము కురుక్షేత్రమున ఒక పేదబ్రాహ్మణు డుండెను. ఒకప్పుడు కొన్ని దినములు అతడు అతని భార్యాబిడ్డలు ఉపవాసముండిరి. తరువాత వారికి కొంచెము పేలపిండి లభించెను. ఆ పిండిని ఆకలిగొనియు వారు తినక అతిథులకు బెట్టి అతిథి యజ్ఞ మొనర్చిరి. అప్పుడొక ముంగిస అతిధులైన బ్రాహ్మణులు తిన్న ఎంగిలి పిండిలో పొరలాడెను. దాని అర్ధదేహము స్వర్ణవికారమును పొందెను. తరువాత ముంగిస ధర్మరాజు కురుక్షేత్రమున జరిపిన రాజసూయ యాగమునందు బ్రాహ్మణ ఉచ్చిష్టమున పొరలాడెను. కాని దాని మిగిలిన సగము దేహము బంగారు వికారము పొందలేదు. ధనవంతుడైన ధర్మరాజొనర్చిన రాజసూయ యజ్ఞముకంటె పస్తులుండి అతిథులను సత్కరించిన అతిథి యజ్ఞమే గొప్పదని పై కథచే నిరూపింపబడినది.

బ్రహ్మయజ్ఞము: మనోయజ్ఞము; ధ్యావయజ్ఞము; జ్ఞానయజ్ఞము- భగవద్గీత భాగవతముల యజ్ఞవిధానము:-

భాగవతము సాత్విక పురాణము. అహింసా సూత్రమును పాటించును. సర్వజీవులను ''ఆత్మకున్‌ సములుగా చింతించ'' వలెనని కోరును. భాగవతమున తొలుతనే నైమిశారణ్యమున ఋషులు సహస్రవర్షంబులనుష్ఠాన కాలంబుగాగల సత్ర సంజ్ఞికంబైన యాగంబు సేయుచుండిరి. ఈ యజ్ఞము హరిని చేరుట కుద్దేశింపబడినది. స్వర్గమును పొందుటకై కాదు. భాగవతపరముగా యజ్ఞములు స్వర్గకాములచేత చేయబడు (స్వర్గకామో యజేత) పశు హింసాయుతములైన అశ్వమేధాది యజ్ఞములు కావు. ''యజ్ఞోవై విష్ణుః''. భాగవతయజ్ఞము ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామముగా జేయబడు మనోయజ్ఞము.మనోయజ్ఞము లేదా ధ్యానయజ్ఞమును గూర్చి శ్రీ నరసింహస్వామి అవ్యక్తోపనిషత్తు నందు బ్రహ్మకిట్లు తెలిపెను.

''మయ్యగ్నౌ స్వాత్మానం హివిర్ధ్యాయే త్తయై7వానుష్టు భార్చా. ధ్యానయజ్ఞో అయవేవ. ప్రజాపతిస్తం యజ్ఞాయ వసీయాంస మాత్మానం మన్యమానో మనోయజ్ఞే నేజే: నప్రణవయా తయై వార్చా. హవిర్ధ్యాత్వా ఆత్మాన మాత్మ న్యగ్నౌ జుహుయాత్‌''

పై యజ్ఞ విధానము అహంకార నాశనము సూచించును. భాగవతమున బ్రహ్మ ఇట్లు తెలిపెను.

క|| యజ్ఞాంగి, యజ్ఞఫలదుడు

యజ్ఞేశుడు, యజ్ఞకర్తయగు భగవంతున్‌

యజ్ఞపురుషుగా మానస

యజ్ఞము గావించితిని.........

------ భాగవతము

భగవద్గీతలో దీనిని బ్రహ్మయజ్ఞముగా శ్రీకృష్ణుడు తెలిపెను.

శ్లో|| బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మౌగ్నౌ బ్రహ్మణా హుతమ్‌

బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా

గీత 4-24

యజ్ఞము, పరికరములు, కర్త, భోక్త, అంతయు బ్రహ్మమని చూచువాడు బ్రహ్మమును బొంది బ్రహ్మ యగును.

శ్లో|| దైవమేవా పరే యజ్ఞం యోగినః పర్యేపాసతే

బ్రహ్మాగ్నా వపరే యజ్ఞం యజ్ఞే నైవోప జుహ్యతి.

గీత 4-25

కొందఱు ఫలాపేక్షతో దేవతలను పూజించుచున్నారు. శుద్ధి గల కొందఱు ఆత్మచేతనే ఆత్మయందు హోమముచేసి జ్ఞానులగుచున్నారు.

శ్లో|| శ్రోత్రాదీ నీన్ద్రియా ణ్యన్యే సంయమాగ్నిషు జుహ్యతి

శబ్దాదీ న్విషయాన్‌ అన్న ఇన్ద్రియాగ్నిషు జుహ్యతి

గీత 4-26

కొందఱు జ్ఞానేంద్రియములను నిగ్రహమను అగ్నిలోవ్రేల్చుచున్నారు. కొందఱు శబ్దము మొదలగు విషయములను ఇంద్రియములనునట్టి అగ్నిలో వ్రేల్చుచున్నారు.

శ్లో|| సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణ కర్మాణి చాపరే

ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్యతి జ్ఞాన దీపితే

గీత 4-27

మఱి కొందఱు సమస్త ఇంద్రియమలు, వాని విషయములను, ప్రాణవాయువుల యొక్క పనులను ఆత్మజ్ఞానముచే ప్రకాశించిన స్వస్వరూపాను సంధానమను అగ్నియందు వ్రేల్చుచున్నారు.

శ్లో|| ద్రవ్య యజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తధాపరే

స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయ స్సంశిత వ్రతాః

గీత 4-28

ద్రవ్యాది ఆరు యజ్ఞములు చెప్పబడినవి. కొందరికి ద్రవ్యదానమే యజ్ఞము, కొందరికి తపస్సు యజ్ఞము, కొందరికి యోగము యజ్ఞము, కొందరికి వేదపఠన జ్ఞాన సంపాదనములే యజ్ఞములు. ఇతరులకు ప్రయత్న పూర్వకముగా కఠిన నియమములే యజ్ఞములు.

శ్లో|| అపానే జుహ్వతి ప్రాణం ప్రాణ7పానం తథా7పరే

ప్రాణాపాన గతీ రుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః

గీత 4-29

కొందరు అపాన వాయువునందు ప్రాణవాయువును వ్రేల్తురు. (పూరకము) ప్రాణవాయువునందు అపాన వాయువును వ్రేల్తురు. (రేచకము) ప్రాణవాయువును అపాన వాయువును లోపలనే నిలుపుదురు (కుంభకము). దీనికి ప్రాణాయామయజ్ఞ మని పేరు.

శ్లో|| అపరే నియతాహారాః ప్రాణాన్‌ ప్రాణషు జుహ్వతి

సర్వే7ప్యేతే యజ్ఞ విదో యజ్ఞ క్షపిత కల్మషాః

గీత 4-30

మరికొందరు ఆహార నియమముచే ప్రాణము మొదలగు వాయువులను ప్రాణము మొదలగు వాయువులందే వ్రేల్చుచున్నారు. ఈ యజ్ఞవేత్త లందరు యజ్ఞము తెలిసిచేసిన వారేగాన సర్వపాపములు బోగొట్టుకొనుచున్నారు.

శ్లో|| ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణోముఖే

కర్మజా న్విద్ధితాన్‌ సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసే||

గీత 4-32

ఇటువంటి యజ్ఞములనేక విధములుగా వేదమునుండి వ్యాపించి నవి. ఈయజ్ఞములన్నియు కర్మములచే బుట్టినవి. శాశ్వత సుఖ మివ్వవని తెలిసినచో బంధవిముక్తి యగును.

శ్లో|| శ్రేయాన్‌ ద్రవ్యమయా ద్యజ్ఞాత్‌ జ్ఞాన యజ్ఞః పరంతపః

సర్వం కర్మాఖిలం పార్థః జ్ఞానే పరిసమాప్యతే

గీత 4-33

అన్ని యజ్ఞములకంటె జ్ఞానయజ్ఞము గొప్పది. మనోవాక్కు కాయిక కర్మలు ఆ కర్మఫలితములు జ్ఞానమునందే లయించుచున్నవి.

బ్రహ్మార్పణబుద్ధితో యజ్ఞము సేయక కోరికతో చేసినప్పుడు, కోరిన వాడుండును. కోరిక లేనప్పుడు, ఇంద్రియములు మనస్సు బుద్ధి అధిష్ఠానముగా గల కామము నశించును (ఇంద్రియాణి మనోబుద్ధి తస్యాధిష్టాన ముచ్యతే). జ్ఞానము ప్రకాశించును.

భాగవతయజ్ఞము స్వర్గకాముడు పశుహింసతో చేయు యజ్ఞము కాదని ప్రాచీనబర్హి కథతో భాగవతమున సూచింపబడినది, పురంజనో పాఖ్యానమునను చెప్పబడినది.

ప్రాచీనబర్హి అసంఖ్యాకములైన గోవులను వధించి యజ్ఞముల జేసెను. నారదుడు ప్రాచీనబర్హిని చూడవచ్చినప్పుడు ''నీవు బలి యొసగిన గోవులు స్వర్గలోకమున లోహమయ శృంగములను బొంది నీపై క్రోధము బూనియున్నవి. నీవు పరలోకగతుడ వైనప్పుడు నిన్ను హింసింప వేచియున్నవి.'' అని చెప్పెను.

ఇది కాక పురంజనోపాఖ్యానమున పుంజనుడు పరలోకగతుడైనప్పుడు, ''పూర్వమున అదయుండైన అతనిచేత హింసిపబడిన యజ్ఞపశువులు క్రోధోద్రేకంబున గుఠారంబుల నతని నఱకెను.''

ఈ కథలవలన పశుహింసాత్మకయజ్ఞము మోక్షప్రదము కాదని భాగవతము చాటిచెప్పుచున్నది కదా? భారత రామాయణముల యందు అశ్వమేధములు చేయబడినవి. భాగవతమున ఋషులచే బహుదీర్ఘ సత్రయాగము ప్రారంభింపబడినది. ఇది ఆజన్మాంతముచేయు రజస్తమోగుణ పరిహారిణియగు ఆత్యంతిక భక్తియజ్ఞ మనవచ్చును.

తపస్సు

1.శారీరక 2.వాచిక 3.మానసిక 4.సాత్విక 5.రాజసిక 6.తామసిక

శారీరక తపస్సు:

తపస్సు శారీరక, వాచిక, మానసికము లనియు, సాత్విక రాజసిక, తామసికము లనియు అరు విధములుగా చెప్పబడినది.

శ్లో|| దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచ, మార్జనం

బ్రహ్మచర్య మహింసాచ శారీర తప ఉచ్యతే

గీత 17-14

దేవతలను బ్రాహ్మణులను గురువులను పండితులను పూజించుటయు, శరీర పరిశుద్ధము కలిగియుండుటయు, నత్ప్రవర్తనము, బ్రహ్మచర్యము, ప్రాణహింస చేయకుండుట, ఇట్టి గుణ సముదాయము శారీరక తపస్సని చెప్పబడుచున్నది.

వాచిక తపస్సు:-

శ్లో|| అనుద్వేగకరం వాక్యం నత్వం ప్రియ హితంచ యత్‌

స్వాధ్యాయాభ్యననం చైవ వాఙ్మయం తప ఉచ్యతే

గీత 17-15

ఇతరుల మనస్సును నొప్పించనిదియు, ప్రియమైనదియు మే లొనర్చునదియు, సత్యమైనదియు అగు సంభాషణమును, వేదముల నభ్యసించుటయు వాక్కుతోచేయబడు తపస్సు అనబడును.

మానసిక తపస్సు :-

శ్లో|| మనః ప్రసాద సౌమ్యత్వం మౌన మాత్మ వినిగ్రహః

భావ సంశుద్ధి రిత్యేత త్తపో మానస ఉచ్యతే ||

గీత 17-16

మనస్సు స్వచ్ఛముగా నుంచుకొనుట, క్రూరభావము లేకుండుట, వాజ్నియమము, మనోనిగ్రహము, నిష్కపట స్వభావము ఇవి మానసిక తపస్సు.

సాత్విక తపస్సు :-

శ్లో|| శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధంమ నరైః

ఆఫలా కాంక్షిభి ర్యుక్తైః సాత్వికం పరిచక్షసే ||

గీత 17-17

శ్రద్ధతోకూడి ఫలమును గోరక ఏకాగ్ర చిత్తముకలిగి చేసిన తపస్సు సాత్విక తపస్సనబడును.

రాజసిక తపస్సు :-

శ్లో|| సత్కార మాన పూజార్థం తపో దంభేనచైవ వ యత్‌

క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చల మధృవమ్‌

గీత 17-18

సత్కారము, గౌరవము, పూజ, వీనికొరకు దంభముచే యేచ బడిన తపస్సు రాజస తపస్సు. ఇది చంచలము, నాశము నొందును.

తామస తపస్సు :-

శ్లో|| మూఢగ్రాహే ణాత్మనో య త్పీడయా క్రియతే తపః

పరస్సోత్సాదనార్థం వాతత్తామస ముదాహృతమ్‌

గీత 17-19

తనకు దుఃఖము కలుగజేయునదియై, ఇతర ప్రాణుల నొప్పించునదై, దురాగ్రహముతో చేయబడిన తపస్సు తామస తపస్సు.

తపస్సులలో మానసిక తపస్సు గొప్పది. దాని వలన 1) చిత్త శుద్ధి, 2) చిత్తైకాగ్రత, 3) చిత్త శాంతి కలుగును. చిత్త శుద్ధి వలన కామక్రోధాది మాలిన్యములు తొలగును. ఇత్తైకాగ్రతవలన మనో విక్షేపము నశించును. చిత్త శాంతివలన సుకదుఃఖాది ద్వంద్వములు నశించి సమత్వము కలుగును.

దానము

1.సాత్విక #9; 2.రాజసిక 3.తామసిక

దానకర్మ కూడ సాత్విక, రాజసిక, తామసికమలుని మూడు విధములు.

సాత్వికదానము :-

శ్లో|| దాతవ్యమితి యద్దానం దీయతే7నుపకారిణ

దేశకాలేచ పాత్రేచ తద్దానం సాత్వికం స్మృతమ్‌

గీత 17-20

దానము చేయుటయే సార్థకమను బుద్ధితో ప్రత్యుపకారముగోరక దేశకాల పాత్రముల గనిపెట్టి చేసెడు దానము సాత్వికదాన మనబడును.

''దానం యజ్ఞానాం వరూఢమ్‌'' దానము గొప్ప యజ్ఞముగా శ్రుతి తెలుపుచున్నది. ఒకరి కిచ్చుట బంధవిమోచనము. ఒకరిరుండి గ్రహించుట బంధహేతువు. ఒకరికి సహాయముచేయుట అతనిలోని భగవంతుని పూజించుటయని భావించవలెను.

రాజసదానము :-

శ్లో|| యత్తు ప్రత్యుపకారార్థం ఫల ముద్దిశ్యవా పునః

దీయతేచ సంక్లిష్టం తదానం రాజసం స్మృతమ్‌

గీత 17-21

ప్రత్యుపకార మపేక్షించి కాని లాభమును గోరికాని చేయు దానము రాజసదానము.

తామసదానము:-

శ్లో|| ఆదేశకాలే యద్దాన మపాత్రేభ్యశ్చ దీయతే

అసత్కృత మనజ్ఞాతం తత్తామస ముదాహృతమ్‌

గీత 17-22

దేశకాల సాత్రముల గమనింపక, మర్యాదలేక సన్మానములేక చేయు దానము తామసదానము.

పై విధముగా శ్రీకృష్ణుడు కర్మను యజ్ఞ దాన తపః కర్మలుగా వర్గీకరించి, సత్కర్మస్వరూపమును తొలుత తెలిపెను. పై వివరములను పరిశీలించిన ఈశ్వరారాధనమే యజ్ఞమనియు, జీవుల కుపకరించుటయే దానమనియు, దేహము ఇంద్రియములు, మనస్సు-వీని మాలిన్యములను పోగొట్టుకొనుటయే తపస్సనియు భావించవలసియున్నది. అన్ని ఆశ్రమములవారు శ్రద్ధతో ఈ మూడు సత్కర్మలను ఆచరించుట కర్తవ్యముగా భావించవలెను. ఇదియే భగవద్గీత భాగవతములలోని కర్మరహస్యము.

వికర్మ :-

నిషిద్ధములు లేదా శాస్త్ర విరుద్ధములైన కర్మలను ''వికర్మ''అందురు. సోమరితనమున కర్మ చేయకుండుటయు వికర్మయే. ఇంద్రియములచే కర్మ చేయకపోయినంత మాత్రముననే అది నైష్కర్మ్యము కాదు. మనస్సుచే ఆయా కార్యములు స్మరింపబడుచునే యుండును.

శ్లో|| కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్‌

ఇంద్రియార్ధాన్‌ విమూధాత్మా మిథ్యాచార స్సఉచ్యతే

గీత 3-6

ఎవడు కర్మేంద్రియములను కదలకుండ చేసినను ఇంద్రియార్థములను లేదా విషయములను తన మనస్సుచే స్మరించునో అతడు మిథ్యాచారుడు. అయినను ఆకలి దప్పి నిద్ర మొదలగువానిని తృప్తి పరచుట తప్పు కానేరదు. ఎందుకనగా అని వాసనలు కలిగింపవు.

శ్లో|| విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః

రస వర్జ్యం రసో7ప్యస్య పరం దృష్ట్వా నివర్తతే

గీత 2-59

ఉపవాసాదులచే కృశింపజేసిన ఇంద్రియమలు ప్రకోపించక పోయినను, మనస్సు మాత్రము విషయవాంఛను వదలదు. ఆత్మ సాక్షాత్కారమైన తరువాతనే విషయమలు తొలగునని గీతాచార్యుడు హెచ్చరించెను.

అ కర్మ :-

''యోగః కర్మను కౌశలమ్‌'' నిస్వార్థబుద్ధితో కర్తవ్యములని కర్మల నాచరించుటయే అకర్మ యనబడును. ఇట్టి కర్మలో స్వార్ధ బుద్ధి, ఫలాపేక్ష, కర్తృత్వాహంకారము ఉండవు.

శ్లో|| కర్మణ్య కర్మయః పశ్యే దకర్మణి చ కర్మయః

స బుద్ధిమాన్‌ మనుష్యేషు స యుక్తః కృత్స్న కర్మకృత్‌

గీత 4-18

ఎవడు కర్మయం దకర్మను, అకర్మయందు కర్మనుచూచునో వాడే బుద్ధిమంతుడు, యోగి, సర్వకర్మలు చేసినవాడు.

పై శ్లోకార్థము విరుద్ధముగా కనిపించవచ్చును. కాని చక్కగా పరిశీలించినచో వైరుద్ధ్యములేదు. ఆత్మకు కర్మబంధము లేదు. ఇంద్రియములు దేహమే కర్మచేయునవి. కాన ఆత్మస్వరూపుడగు జీవుడు, సత్వరజన్తమో గుణములే కర్మ చేయించుచున్నవి తెలిసికొనలేక తాను కర్మ చేయుచున్నానని భ్రమ చెందును. అట్టి భ్రమ లేని ఎడల కర్మ చేయుచున్నను కర్మయందకర్మను చూచుట యగును.

కర్తృత్వములేక ఫలవాంఛలేక ఈశ్వరార్పణ బుద్ధితో దేహమొనర్చు కర్మను సాక్షి మాత్రముగా చూచుటవలన కర్మ చేసినను చేయనివాడే యగును. వాడే అసంగ కర్మాచరణుడులేక కర్మ సన్యాసి.

సోమరితనముచే గాని, అనారోగ్యముచేత గాని దేహేంద్రియములచే కర్మను వదలిన అది అకర్మ కానేరదు. మనస్సుతో వారు సంకల్ప వికల్పాత్మకమగు కర్మను చేయుచుందురు. అనగా దేహము నిష్క్రియముగానున్నను మనస్సు వాసనాబద్ధమై కర్మ చేయుచున్నది. ఇట్లు తెలిసికొనుటయే అకర్మయందు కర్మను జూచుట యగును.

శ్లో|| నకర్మణా మనారంభా న్నైష్కర్మ్యం పురుషోశ్నుతే

నచ సన్యస్యనా దేవ సిద్ధిం సమధి గచ్ఛతి.

గీత 3-4

పురుషుడు కర్మ చేయక పోవుటవలన కర్మ శూన్యత కలుగదు. కర్మలను విడచినంత మాత్రమున సిద్ధియు లభింపదు.

కర్మల నెందు కాచరించవలెను :-

కర్మల చేయక ఉండుట అసాధ్యమని గీతాచార్యుని అభిప్రాయము.

శ్లో|| స కశ్చ క్షణమపి జాతు తిష్ఠ త్యకర్మకృత్‌ ----- గీత 3-5

ఎవడుగాని ఒక క్షణమైనను కర్మలను చేయక ఉండ జాలడు. గాఢనిద్రయందును సమాధియందును మాత్రమే కర్మ యుండదు.

శ్లో|| నహి దేహభృతాం శక్యం త్యక్తుం కర్మా ణ్యశేషతః

గీత 18-11

దేహధారులకు అన్ని కర్మలు వదలుట అశక్యము.

శ్లో|| నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః

శరీర యాత్రాపిచ తే నప్రసిద్ధే దకర్మణః

గీత 3-8

కాబట్టి నిత్యమైన కర్మలను చేయుము. ఇంద్రియములతో కర్మచేయకుండుట కంటెను కర్మచేయుట మేలు. నీవు కర్మ చేయనేని శరీరయాత్రయు జరుగదు.

బ్రహ్మదేవుడు కూడ ప్రజలను కర్మ చేయుమని ఆదేశించెను.

శ్లో|| సః యజ్ఞాః ప్రజాసృష్టా పురోవాచ ప్రజాపతిః

అనేన ప్రసవి ష్యధ్వ మేషవో7స్త్విష్టకామ ధుక్‌

గీత 3-4

పూర్వము ప్రజాపతి యజ్ఞములతోకూడ ప్రజలను సృజించి ఇట్లు తెలిపెను. ''మీరు యజ్ఞముల చేసి వృద్ధి పొందుడు. ఇవి మీరు కోరిన కోర్కెలను తీర్చును.''

ఇదిగాక ప్రాణులన్నమువలనను. అన్నము వర్షాధిపతివలనను వర్జన్యుడు యజ్ఞమువలనను, యజ్ఞము కర్మవలనను, కర్మ వేదము వలనను కలుగును. ఇట్టి పరస్పర కారణభూతమగు జగచ్చక్రములో యజ్ఞకర్మనాచరింపవలయును. కాబట్టి కర్మచేయక తప్పదు. వదలు ప్రసక్తియే లేదు.

శ్లో|| సర్వ కర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః

మత్ప్రసాదా దవాప్నోతి శాశ్వతం పద మవ్యయం

గీత 18-56

నిరంతరము సర్వకర్మలు చేయుచున్నవాడైనను. నన్నాశ్రయించినవాడు నా అనుగ్రహమువలన నాశరహితమగు మోక్షస్థానమును బొందుచున్నాడు.

కర్మల నెట్లాచరింపవలెను :-

శ్రీ వాశిష్ఠ గణపతిముని కర్మయోగము నిట్లు నిర్వచించెను. ''ఫలాపేక్షా రహితం సత్కర్మా కర్మయోగః'' ఫలాపేక్ష లేక సత్కర్మనాచరించుటయే కర్మయోగమనబడును. యజ్ఞ దాన తపములు శ్రద్ధతో చేసిన సత్కర్మలగును. శాస్త్రోక్తమైన కర్మలను పరమ పురుషార్థమునకు సాధన మగునట్లు చేయగల ఉపాయ విశేషమే కర్మయోగము.

(యోగః కర్మను కౌశలమ్‌). మమత్వము, ఫలాశ, సంగము, అహంకారము, కామము వీనిని వదలి ఈశ్వరార్పణబుద్ధితో కర్మల నాచరింపవలయును.

శ్లో|| బ్రహ్మ ణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః

లిప్యతే న స పాపేన పద్మ పత్ర మివాంభసా||

గీత 5-10

ఎవడు తానుచేయు కర్మలను భగవంతున కర్పించి ఫలాసక్తి విడిచి చేయుచున్నాడో అతనికి తామరాకును నీరంటని విధమున పాపము లంటవు.

భాగవతమునకూడ ''కర్మంబులు సంసార హేతుకంబు లయ్యును, ఈశ్వరార్పితంబులై తమ్ము తాము చెరచుకొన నోపియుండుననియు, భగవంతుని భక్తితో గొలుచుచు కర్మల నాచరించిన అవి చెడి విష్ణు భక్తి పెరుగుననియు తెలుపబడినది.

గీ|| కర్మ తంత్రుడగుచు కమలాక్షు గొలుచుచు

నుభయ నియత వృత్తి నుండుచుండ

జెడును కర్మమెల్ల శిథిలమై మెల్లన;

ప్రబలమగుచు విష్ణుభక్తి చెడదు.

భాగవతము 8-126

శ్లో|| యత్కరోషి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్‌

యత్తపస్యసి కౌన్తేయః తత్కురుష్వ మదర్పణమ్‌

గీత 9-27

యజ్ఞ దాన తపః కర్మలు నా కర్పించి చేయుము. దేహయాత్రకై చేయు లౌకిక కర్మను హోమమును దానమును నాకర్పణ చేయుము.

శ్లో|| శుభాశుభ ఫలై రేవం మోక్ష్యనే కర్మ బంధనైః

సన్యాస యోగయుక్తాత్మా విముక్తో మా ముపైష్యసి

గీత 9-28

ఇట్లు సర్వ కర్మలు నా కర్పించుటవలన శుభాశుభ ఫలములుగల కర్మబంధములచే విముక్తుడ వగుదువు. నన్ను బొందగలవు.

శ్లో|| బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే

తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మను కౌశలమ్‌

గీత 2-50

సమత్వబుద్ధితో కర్మలనాచరించిన పుణ్యపాపము లంటవు. సమత్వమే యోగము. దాని నవలంబింపుము. కర్మలను చేయుట యందు నేర్పడితనమే యోగము.

శ్లో|| యోగస్థః కురు కర్మాణి నంగం త్యక్త్వా ధనంజయ

సిద్ధ్య సిధ్ద్యోః నమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే

గీత 2-48

సమత్వము యోగ మనబడును. కర్తృత్వాభిమానమును వదలి కార్యము సిద్ధించినప్పుడును ప్రతికూలించినప్పుడును సమబుద్ధి కలిగి యుండుము. యోగమునందున్నవాడవై కర్మల నాచరింపుము.

శ్లో|| దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ద్ధనంజయః

బుద్ధౌ శరణ మన్విచ్ఛ కృపణాఃఫలహే తవః

గీత 2-49

సమత్వ బుద్ధితో కూడికొనిన నిష్కామకర్మ కంటె కామ్య కర్మలు తక్కువ. ఫలాభిలాషను వదలి కర్మను చేయుము. ఫలమును గోరువారల్పులు.

శ్లో|| యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభ్య తేర్జునః

కర్మేంద్రియైః కర్మయోగ మసక్తః స విశిష్యతే ||

గీత 3-7

ఎవడు మనస్సుచేత ఇంద్రియముల నిగ్రహించి ఫలాపేక్ష లేని వాడగుచు కర్మేంద్రియములచేత కర్మయోగము ననుష్ఠించునో అతడుత్తముడు.

శ్లో|| తస్మా దసక్తం సతతం కార్యం కర్మ సమాచర

అసక్తో హ్యా చరన్‌ కర్మ పరమాప్నోతి పూరుషః

గీత 3-19

నీవు ఫలమునందాసక్తిలేక నిరంతరము నియతమగు కర్మనుచేయుము. అసక్తుడై కర్మను చేసినవాడుముక్తిని బొందును.

శ్లో|| సక్తా కర్మ ణ్యవిద్వాంసో యధా కుర్వంతి భారతః

గుర్వా ద్విద్వాం స్తధా7సక్తోశ్చికీర్షుర్లోక సంగ్రహమ్‌

గీత 3-25

ఫలాపేక్షతోకూడిన కర్మయందు అజ్ఞాని కెంత శ్రద్ధయో అట్లే జ్ఞానియు ఇతరుల నిమిత్తమై అంతశ్రద్ధతో నిష్కామకర్మ చేయవలయును.

శ్లో|| కాయేన మనసా బుద్ధ్యా కేవలై రింద్రియై రపి

యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా7త్మ శుద్ధయే

గీత 5-11

యోగులు చిత్త శుద్ధికొరకు ఫలాభిలాషను వదలి శరీరముచేతను మనస్సుచేతను ఇంద్రియములచేతను మాత్రమే కర్మలు చేయుచున్నారు.

కర్మ ఎప్పుడు మనలను బద్ధులను జేయదు :-

శ్లో|| యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః

జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః

గీత 4-19

ఎవని కర్మలు కామ సంకల్పములు కలవి కావో ఎవని కర్మలు జ్ఞానాగ్నిచే దహింపబడినవో అట్టివాడు పండితుడు.

శ్లో|| #9; త్యక్త్వా కర్మ ఫలా సంగం నిత్యతృప్తో నిరాశ్రయః

కర్మణ్మభి ప్రవృత్తోపి నైవకించి త్కరోతి సః

గీత 4-20

కర్మ ఫలాపేక్షను వదలి నిత్యతృప్తుడై విషయ ప్రవృత్తి లేని వాడు కర్మ చేయుచుండినను కర్మచేయని వాడగును. వాని కర్మ జ్ఞానాగ్నిచే దహింపబడుటచే అకర్మయే యగును.

శ్లో|| నిరాశీ ర్యతచిత్తాత్మా త్యక్త స్సర్వ పరిగ్రహః

శారీరం కేవలం కర్మ కుర్వ న్నాప్నోతి కిల్బిషమ్‌

గీత 4-21

కోరికలు వదలి చిత్తము స్వాధీనమునందుంచుకొని అభిమానము వదలి శరీర పోషణమునకై కర్మ చేయువానికి పాపము అంటదు.

శ్లో|| గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః

యజ్ఞి యాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే

గీత 4-23

ఆసక్తి లేనివాడు ముక్తుడై జ్ఞానమునందు నిశ్చల బుద్ధికలిగి భగవత్ప్రీత్యర్థము చేయు కర్మ నిశ్శేషముగా నశించును.

శ్లో|| యస్య నాహంకృతో భావో బుద్ధి ర్యస్య నలిప్యతే

హత్వాపి స ఇమాంలోకాన్‌ నహన్తి న నిబధ్యతే

గీత 18-17

ఎవనికి నేను చేయుచున్నానను భావనలేదో ఎవని బుద్ధి ఆ కర్మఫలముచే అంటుపదడో అట్టివాడు లోకమందలి ప్రాణులను లౌకిక బుద్ధిచే చంపినవాడయ్యును, పరమార్థ దృష్టిచే నాతడు చంపువాడు కాడు. కర్మలచే బంధింపబడువాడు కాడు.

అనగా తాను దేహాదలు కాదని తెలిసికొని ఆత్మానుభూతిని పొందిన తరువాత కర్మ ఫలితములు బాధింపవు. శరీరము నే నను భ్రాంతి ఉన్నంతవరకు శాంతి కుదరదు. నేను చేయుచున్నానను అహంభావ మున్నంతవరకు అనుభవింప వలసినదే. ఆ భావన నశించినప్పుడు తనకేదియు నంటదు. జీవు డెవరో తెలియక జీవునకు కర్మఫల మే విధముగా వచ్చినదను ప్రశ్న అనవసరమని రమణమహర్షి తెలిపెను. తన్ను తానెరిగిన తరువాత ప్రశ్న లుండవు.

కర్మఫల మెవరనుభవింతురను ప్రశ్నకు భాగవత సమాధానము చూడుడు.

క|| #9; కర్మమున బుట్టు జంతువు

కర్మమునన వృద్ధిబొందు, గర్మమున జెడున్‌

కర్మమె జనులకు దేవత

కర్మమె సుఖదుఃఖములకు కారణ మధిపాః

క|| కర్మములకు దగు ఫలములు

కర్ములకు నిడంగ రాజుగాని సదా ని

ష్కర్ముడగు నీశ్వరుండును

కర్మవిహీనునకు రాజుగాడు మహాత్మా ||

భాగవతము-దశమస్కంధము

కర్మలు చేయించున దేది?

కర్మకు కారణము సంకల్పము కామమేకాని ఆత్మకాదని గ్రహింపవలయును. సత్వరజస్త మోగుణములే కర్మను చేయించును.

శ్లో|| ప్రకృతేః క్రియామాణాని గుణౖః కర్మాణి సర్వశః

అహంకార విమూఢాత్మా కర్తాహ మితి మన్యతే ||

గీత 3-27

ప్రకృతివలన కలిగిన సత్వరజస్తమో గుణములు కర్మలకు కారణమగుచుండగా అహంకారముగల అవివేకి ఆ కర్మలన్నియును తనచే జరుగుచున్నవని తలచును.

శ్లో|| ప్రకృత్యైవచ కర్మాణి క్రియమాణాని సర్వశః

యః పశ్యతి తధాత్మాన మకర్తారః స పశ్యతి. గీత 13-30

ఎల్ల కర్మలు ప్రకృతి సంబంధమగు గుణములచే చేయబడునట్లెవ డెరుగునో వాడుతనలో అంతర్గతమగు ఆత్మను కర్మలుచేయని దానివిగా చూచుచున్నాడు.

శ్లో|| కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతి జై ర్గుణౖః

గీత 3-5

ప్రకృతి గుణములకు లోబడుచు ప్రాణులు కర్మలను జేయును.

శ్లో|| తత్వవిత్తు మహాబాహోః గుణకర్మ విభాగయోః

గుణా గుణషు వర్తంత ఇతి మత్వా న సజ్ఞతే.

గీత 3-28

సత్వరజస్త మో గుణములు వానివాని భాగములను బట్టి వాని పనులను జేయించుచున్నవి. నేను మాత్రము సాక్షిని. నాకేమియు సంబంధములేదని జ్ఞాని తలచును. అందుచే కర్మబంధ మతని కంటదు.

శ్లో|| నాన్యం గుణభ్యః కర్తారం యదాద్రష్టాను పశ్యతి

గుణభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధి గచ్ఛతి.

గీత 14-19

ఎవడు గుణములే కర్తలనియు తాను సాక్షి కారనమనియు నెఱుగునో అతడు నా స్వరూపమును జెందును.

శ్లో|| అధిష్టానం తథా కర్తా కరణంచ పృథ గ్విధమ్‌

వివిధాశ్చ పృథక్‌ చేష్టా దైవం చైవాత్ర పంచమమ్‌

గీత 18-14

శ్లో|| శరీర వాఙ్మనోభి ర్యత్కర్మ ప్రారభ##తే నరః

న్యాయంవా విపరీతం పంచైతే తస్య హేతవః

గీత 18-15

శరీరము, అహంకారము, నానావిధములగు చక్షురాది ఇంద్రియములు, వివిధములగు ప్రాణాపానాదుల వ్యాపారములు, దైవము అనుననవి ఐదును అధిష్టానములు. మనుష్యుడు శరీరముచేతను మనస్సు చేతను వాక్కుచేతను చేయునట్టి సత్కర్మలకును దుష్కర్మలకును ఈ అధిష్ఠానములే కారణములు.

శ్లో|| తత్రైవం సతి కర్తార మాత్మానం కేవలంతు యః

పశ్య త్యకృత బుద్ధి త్వా న్నసపశ్యతి దుర్మతిః

గీత 18-16

ప్రతి కర్మకు కారణము పై జెప్పి నట్లుండగా ఎవరు కర్మకు దానేకర్తనని తలచుచున్నాడో అతడు తెలివిగలవాడు కాజాలడు. అట్టి అజ్ఞాని ఆత్మతత్వము తెలియలేడు.

శ్లో|| స్వభావజేన కౌన్తేయః నిబద్ధస్స్వేన కర్మణా

కర్తుం నేచ్ఛసి యన్మోహా త్కరిష్య స్యపశో7పితత్‌

గీత 18-60

స్వభావజన్య గుణములకు లోబడిన నీవు ఎట్టి కర్మ చేయగూడదని అవివేకముతో నిశ్చయించెదవో అట్టి కర్మ నీకు తెలయకయే నీ స్వభావగుణము నిన్ను మరపుజేసి నీచే చేయించును.

జ్ఞానికైనను కర్మ నిరాకరించుట అశక్యము.

శ్లో|| సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే ర్‌జ్ఞానవానపి

ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి

గీత 3-33

జ్ఞానవంతుడైనను తన పూర్వజన్మ కర్మనుబట్టి ఏర్పడిన స్వభావమునకు గతినట్లు కర్మనుచేయుచున్నాడు. ప్రాణులబట్టి స్వభావముననుసరించును. అందుటకై కర్మల చేయక నిరాకరించుట ఎంతమాత్రము లాభకారికాదు. పనులు త్రిగుణముల ననుసరించి జరుగును. జ్ఞానమును పొంది ఆ కార్యములపై రాగద్వేషములు కాని, వాని ఫలితముపై అభిమానముకాని వదలవలెను.

శ్లో|| తమేవ శరణం గుచ్ఛ సర్వ భావేన భారతః

తత్ప్రసాదాత్‌ పరాం శాంతిమ్‌ స్థానం ప్రాప్యసి శాళ్వతమ్‌

---- గీత

కావున ఈశ్వరునే శరణు పొందుము. ఈశ్వరానుగ్రహము వలన శాంతిని ముక్తిని బొందుదువు.

పూర్వకర్మను తరింపవచ్చునా? జ్ఞానికి కర్మ కలదా?

ఆత్మకు భూత భవిష్యత్తులు లేవు. అందువలన నీవు దేహాదులు కావని తెలిసికొన్నప్పుడు కర్మఫలమలు బంధింపవు. ప్రస్తుతము ఆత్మను తెలిసికొన్న చాలును. జ్ఞానికి సంచితకర్మ ఆగామి కర్మలేవని చెప్పుదురు. కాని ప్రారబ్ధము ననుభవించి తీరవలయునని చెప్పుదురు. ''అవశ్యమను భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం'' ఈ మాట అజ్ఞానులకే చెల్లుననియు జ్ఞానికి ప్రారబ్ధముకూడ లేదనియు రమణ మహర్షి ఇట్లు తెలిపెను.

శ్లో|| కర్మాగామిచ సంచితంచ విదుషో నష్టే భ##వే తాం ధృవం

ప్రారబ్ధం నవినశ్వతీతి గదితం గ్రంథేషు మందాన్‌ ప్రతి

ప్రత్యేకా నసుమంగలీ పతిమృతౌ బహ్వీషు యద్వ ద్భవేత్‌

ఏవం కర్తరి బాధితే ప్రవిలయం కర్మ త్రిధాయాస్యతి.

33 సూక్తి సుధ-రమణమహర్షి

జ్ఞానికి సంచిత ఆగామలు కలుగవు. ప్రారబ్ధము మిగులుననుట పరుల ప్రశ్నకు జవాబు మాత్రమే. భర్త పోయిన తర్వాత వైధవ్యము జెందని భార్య లేనట్లు కర్త పోయిన తరువాత కర్మత్రయము లేదు.

కరోమి కర్మేతి నరో విజానన్‌

బాధ్యో భ##వే త్కర్మఫలంచ భోక్తుం

విచార ధూతా హృది కర్తృతాచేత్‌

కర్మత్రయం నశ్యతి నైవముక్తిః ------ షడ్దర్శనము

నేను ఫలాని కర్మచేయుచున్నానని చేయువాడు కర్మ ఫల మనుభవించక తప్పదు. కాని ఆత్మ విచారమువలన చేయువాడు తాను కానను నిశ్చయజ్ఞానము కలిగిన అతనికి మూడు విధములగు కర్మ నశించును. అదే నిజమైన ముక్తి.

కర్తృత్వము భోక్తృత్వము ఉన్నంతవరకే కర్మకు నీపై అధికారమున్నది. పై రెండు కలిగిన నేను నశించినయెడల, అనగా కర్తభోక్త నశించిన తరువాత ఆగామి సంచిత ప్రారబ్ధము లెవరికి? అది జీవన్ముక్తావస్థ.

భాగ్యవంతునకు దరిద్రునకు యువకునకు వృద్ధునకు నిద్రలో చింతలేదు. సుఖదుఃఖాలు జాగ్రదవస్థలో ఉంటాయి. ప్రారబ్ధము నిద్రలో పని చేయదుకదా! కాబట్టి ప్రారబ్ధము కర్మ అనేది మనస్సు. దాని విలాసము. మనస్సున్నంత కాలము ఉండును.

మానవులకు కర్మ చేయుట యం దధికారమా?

ఫలమునం దధికారమా?

శ్లో|| కర్మణ్య వాధికారస్తే మా ఫలేషు కదాచన

మా కర్మఫల హేతుర్భూ ర్మాతే సంగో7స్త్వకర్మణి

గీత 2-24

విహితకర్మలు చేయుటయందే నీకు స్వతంత్రము. కర్మఫలము దైవాధీనమగుట ఫలమునందెప్పుడును నీకు స్వతంత్రము లేదు. కర్మను చేయుటకు ఫలమును హేతువుగా నుంచుకొనకుము. కర్మలను వదలకుము. సంగము లేక కర్మలను చేయము.

కర్మ జడమగుటచే ఫలము నివ్వదు. ఈశ్వరుడే ఫలప్రదాత. శ్రీ రమణమహర్షి ఉపదేశసారములో ఇట్లు తెలిపెను.

''కర్తు రాజ్ఞయా ప్రాప్యతే ఫలం

కర్మ కిం పరం? కర్మత జ్జడం

కర్మము ఫలమిచ్చు గర్త్రాజ్ఞవలన

కర్ముము దైవమా? కర్మము జడమె.

---- ఉపదేశసారము

కర్మగోప్పదా? జ్ఞానము గొప్పదా?

అర్జునునకు ఒక సందేహము కలిగెను. శ్రీకృష్ణుడు డొకప్పుడు కర్మ గొప్పదనియు, ఒకప్పుడు జ్ఞానము శ్రేష్ఠమనియు చెప్పుటచేత ఇదమిత్థమని నిర్ణయింప జాలడయ్యెను.

శ్లో|| వ్యామిశ్రేణౖవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే

తదేకం వద నిశ్చిత్య యేనశ్రేయో7హ మాప్నుయామ్‌

గీత 3-2

ఒకప్పుడు కర్మ గొప్పదనియు, ఒకప్పుడు జ్ఞానము గొప్పదనియు చెప్పుచున్నావు. ఆ రెంటిలో ఏది గొప్పది? దేని వలన శ్రేయస్సును పొందగలనో అట్టి దొక్కదానిని తెలుపుము. శ్రీకృష్ణుడిట్లు బదులు చెప్పెను.

శ్లో|| లోకేస్మిన్‌ ద్వివిధా నిష్ఠా పురాప్రోక్తా మయానఘః

జ్ఞాన యోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం.

గీత3-3

పూర్వము నాచేత సాంఖ్యులకు జ్ఞానయోగము యోగులకు కర్మయోగము అని రెండు విధములుగ నిష్ఠ చెప్పబడినది. కర్మచేయక సన్యాసముచే ముక్తి కలుగదు. కర్మయోగము సాధన. దాని లక్ష్యము జ్ఞానము.

శ్లో|| #9; న కర్మణా మనారంభా న్నైష్కర్మ్యం పురుషోశ్నుతే

నచ సన్యస్య నాదేవ సిద్ధిం సమధి గచ్ఛతి.

గీత 3-4

పురుషుడు కర్మల చేయకపోవుటచేత నైష్కర్మసిద్ధి కలుగదు. కర్మలను త్యజించినంత మాత్రముననే సిద్ధి లభింపదు.

కర్మ శాస్త్ర చోదన మగుటచేత చోదనాతంత్రము పురుషుని యిచ్ఛకు విషయ మగుటచే పురుషతంత్రము అనిత్య ఫలదాయకము. పునర్జన్మ హేతువు, పరమాత్మజ్ఞానము వస్తుతంత్ర మనబడును. ఇది మోక్షప్రదము.

కర్మయోగము సన్యాసమునకు గల తారతమ్యము :-

శ్లో|| సన్యాసః క్మయోగశ్చ నిశ్శ్రేయస కరావుభౌ

తయోస్తు కర్మ సన్యాసా త్కర్మయోగో విశిష్యతే

గీత 5-2

జ్ఞాన కర్మ మార్గములు రెండును ముక్తి నిచ్చును. జ్ఞానమార్గము కన్న నిష్కామ కర్మమార్గమే శ్రేష్ఠమైనది.

శ్లో|| జ్ఞేయ స్స నిత్య సన్యాసీ యో నద్వేష్టి నకాంక్షతి.

నిర్దవందోహి మహాబాహో సుఖం బంధా త్ర్పముచ్యతే

గీత 5-3

రాగద్వేషముల జయించినవాడు కర్మ చేయుచున్నను సన్యాసియే. సంసార రూపమందు బంధమునుండి విముక్తు డగును.

శ్లో|| సాంఖ్యయోగా పృథగ్బాలాః పవదంతి న పండితాః

ఏకమప్యా స్ధిత స్సమ్య గుభయో ర్విందతే ఫలమ్‌

గీత 5-4

సాంఖ్యము వేరని యోగము వేరని అజ్ఞానులు పల్కుదురు. జ్ఞాను లట్లనరు. పై రెండింటిలో ఒకదానిని బాగుగా ఆచరించినను రెండింటి ఫలమును పొందుచున్నాడు.

శ్లో|| యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే

ఏకం సాంఖ్యంచ యోగంచ యః పశ్యతి స పశ్యతి

గీత 5-5

ఏ ముక్తి స్థానము సాంఖ్యులచే పొందబడుచున్నదో అది కర్మ యోగులచేతను పొందబడుచున్నది ఎవడు సాంఖ్యమును యోగమును దెలియునో అతడు సమస్తమును దెలియుచున్నాడు.

శ్లో|| సన్యాసస్తు మహాబాహో! దుఃఖమాప్తు మయోగతః

యోగయుక్తో మునిర్ర్బహ్మా నచిరే ణాధిగచ్ఛతి.

గీత 5-6

కర్మయోగ మాచరింపని సన్యాసము నిర్వహించుట చాల కష్టతరము. నిష్కామకర్మ యోగానంతరము బొందు సన్యాసముచే వెంటనే ముక్తిని బొందును.

ఎవడు కర్మ చేయనక్కరలేదు; నెష్కర్మ్య సిద్ధి :-

శ్లో|| యస్యాత్మ రతిరేవస్యా దాత్మ తృప్త శ్చ మానవః

ఆత్మన్యేవచ సంతుష్ట స్తస్య కార్యం న విద్యతే గీత 3-17

ఎవడు ఆత్మయందు రమించువా డగునో, ఎవడు దానిచేతనే తృప్తుడగునో, మఱియు దానియందే సంతోషమును పొందునోవాడు చేయవలసినదేమియు నుండదు.

శ్లో|| నైవ తస్యకృతే నార్థో నాకృతే నేహ కశ్చన

న చాస్య సరవభూతేషు కశ్చి దర్థ వ్యపాశ్రయః

గీత 3-18

ఆత్మ నిష్ఠ గలవానికి ఏ కార్యము చేయుటవలనను ప్రయోజనము లేదు. అతడు ఏ ప్రాణులను దేనికిని ఆశ్రయించవలసిన పని లేదు.

దేవీగీతయందు ఎప్పుడు సన్యసించవలె ననుటకు సమాధానము చెప్పబడినది. ఎప్పుడు కర్మలను వదలవచ్చును? వేదమునందు

''కుర్వ న్నేవహి కర్మాణి జిజీవేషే చ్ఛతగ్‌ం సమాః''

ఈ లోకములో విహితకర్మల నాచరించునునే నూరు సంవత్సరములు బ్రదుక నిశ్చయింపవలెనని తెలుపబడినది.

శ్లో|| #9; కుర్వన్నేవహి కర్మాణి త్యతః కర్మా ప్యవశ్యకమ్‌

దేవీగీత 3-11

పై శృతి వచనమువలన బ్రతికినంతకాలము కర్మ చేయవలయు నని విధింపబడినది కదా!

''జ్ఞానా దేవహి కైవల్యమ్‌'' అని శంకరులు చెప్పిరి.

శ్లో|| జ్ఞానా దేహూ కైవల్య మతస్సాత్త త్సముచ్యయః

దేవీగత 3-12

అజ్ఞానము తొలగించుటకు జ్ఞాన మావశ్యక మగుటచే రెండును చేయవలయును.

శ్లో|| సహాయతాం వ్రజేత్‌ కర్మ జ్ఞానస్య హితకారిచ

ఇతి కేచి ద్వదం త్యత్ర తద్విరోధాన్న సంభవః

దేవీగీత 3-12

కర్మ జ్ఞాననమునకు హితకారి యగుటచేత రెండును చేయవలయునని కొందరి మతము.

శ్లో|| జ్ఞానా ద్ధృద్గ్రంధి భేదస్యా ద్థృద్గ్రంధే కర్మ సంభవః

కాని హృదయగ్రంధి నశించిన జ్ఞానము సంభవించును, హృదయ గ్రంధి యనగా మనోదేహములు వాని సాక్షియగు ఆత్మ రెండును ఒకటిగా భావించుట.

ఆత్మసాక్షాత్కారము కలిగిన తరువాత మనోదేహములు ఆత్మ కన్న వేరని తెలియును. అందువలన కర్మ నశించును.

శ్లో|| ¸°గపద్యం న సంభావ్యం విరోధాస్తు న తస్త యోః

తమః ప్రకాశయో ర్యద్వత్‌ ¸°గపద్యం న సంభవి.

దేవీగీత 3-14

చీకటి వెలుగు లెట్లు కూడియుండ జాలవో అట్లే జ్ఞానకర్మలు అన్యోన్య విరుద్ధము లగుటవలన కూడియుండజాలవు.

శ్లో|| తస్మాత్‌ సర్వాణి కర్మాణి వైదికాని మహామతే!

చిత్త శుద్ధ్యంత మేనస్తు స్తాని కుర్యా త్ర్పయతతః

దేవీగీత 3-15

వైదిక కర్మ చిత్తము పరిశుద్ధ మగువరకు చేయవలయును.

శ్లో|| శమోదమ స్తితిక్షాచ వైరాగ్యం సత్త్వ సంభవమ్‌

తావ త్పర్యంత మేనస్యుః కర్మాణి న తతః పరమ్‌

దేవీగీత 3-16

మనస్సు నిలుపుట, బాహేంద్రియములను విషయము లంటక నిరోధించుట, చలి, ఎండ, సుఖము,దుఃఖము మొదలగు వానిని సహించుట, రాజ్యాది సుఖములను, స్వర్గభోగాదులను ఏవగించుట, అంతఃకరణమున రజస్త మోభావ రహితమైన శుద్ధ సత్వ మేర్పడుట ఇట్టి జ్ఞానాంగ సంపత్తులు కలుగగనే వైదిక కర్మలు వదల వలయును. అనగా దేవీగీత జ్ఞానకర్మ సముచ్చయ వాదము నంగీకరింపదు. జ్ఞానిలోక సంగ్రహమునకై కర్మలు చేసినను అది కర్మ అనిపించుకొనదని శంకరుని మతము. ఎందుకనగా అట్టి కర్మ నిజమనోరథ ఫలదాయకముగా చేయబడుట లేదు.

జ్ఞాని వాసనాయుతము కాని మనస్సుతో పనిచేయును. అది కర్మ అనిపించుకొనదు. వాసనాయుతమగు మనస్సు పనిచేయకున్నను చేసినదే యగును.

బుద్ధి శుద్ధిద్వారా మోక్షసామ్రాజ్యము చేకూరుటకు ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామకర్మ చేయవలయును. ఇది సత్వశుద్ధి కలిగించి జ్ఞానోత్పత్తికి హేతువగును. ఇది కర్మయోగము. బ్రహ్మముతో తాదాత్మ్యము భావించుట జ్ఞానయోగము.

ఈశ్వరార్పితమైన నిష్కామకర్మవలన భక్తుడు అహంకార మమకారములను, కర్తృత్వ భోక్తృత్వములను బాయును. కర్తృసంగ ఫలసంగమే జీవుని బద్ధుని జేయునవి. అహంవృత్తియే మనస్సు యొక్క తొలివృత్తి. అహంకారము లేనప్పుడు మమకారము లేదు. అందువలన స్వస్వరూప జ్ఞానము కలవాడై యుండును.

ఆత్మానాత్మ విచారమువలన కూడ అహంకార మమకారములు నశించును. జ్ఞానము సిద్ధించును. అందువలన నిష్కామకర్మగాని ఆత్మానాత్మ విచారముగాని జ్ఞానసిద్ధితో పరిసమాప్తమగును. నిష్కామ కర్మవలన చిత్తశుద్ధి జ్ఞాననిష్టా యోగ్యత కలుగును. సర్వకర్మ సన్యాస పూర్వక ఆత్మజ్ఞాన నిష్ఠచేత మోక్షము కలుగును కర్మ సముచ్చిత జ్ఞానమువలన మోక్షముకాదు. అందులకే బులుసు అప్పన్న శాస్త్రిగారు ''తస్మాత్‌ గీతాసు కేవల దేవతత్త్వ జ్ఞానాన్‌ మోక్ష ప్రాప్తిః నకర్మ సముచ్చితా దితి నిశ్చితో7ర్థః|| అని తెలిపియున్నారు.

హృదయగ్రంధి వీడిన తరువాత కర్తవ్యము:-

''భిద్యతే హృదయగ్రంధి శ్ఛిద్యంతే సర్వ సంశయః క్షీయంతే చాశ్యకర్మాణి తస్మిన్‌ దృష్టే పరావరే'' ముండకోపనిషత్తు.

బ్రహ్మ సాక్షాత్కారానంతరము హృదయగ్రంధి విడిపోవును. సమస్త సంశయములు నశించును. అట్టివాని కర్మలు క్షీణించును. హృదయ గ్రంధి విడపోవువరకు అనగా దేహము మనస్సు తానుగాదని తెలిసి ఆత్మసాక్షాత్కారమైన తర్వాత కర్మలు తమంతతామే నశించును.

నిష్కామకర్మయోగము ననుసరించి శాంతిని పొందిన తర్వాత

శ్లో|| యోగీ యుజ్ఞీత సతత మాత్మానం రహసి స్థితః

ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీ ర పరిగ్రహః

గీత 6-10

శ్లో|| యజ్ఞ న్నేవం సదాత్మానం యోగీ నియత మానసః

శాన్తిం నిర్వాణ పరమాం మత్సం స్థా మధిగచ్ఛతి

గీత 6-15

శాంతి లభించిన తరువాత యోగి రహస్య ప్రదేశమున ఒంటరిగా నుండి మనోదేహముల లయించి, ఆశల విడచి, ఆత్మధ్యాన నిమగ్నుడు కావలెను. దీనినే సీతారామాంజనేయ సంవాదమున

సీ|| అనిశంబు పద్మాస నాసీనుడై చూపు

లమరంగ నాసికాగ్రమున నిలిపి

ఇంద్రియంబుల నెల్ల నిట్టట్టు వోనీక

మదిచేత తిరముగా గుదియబట్టి

ప్రాణాది దశవిధ పవనంబులను వికా

రము లంటకుండ జొక్కముగ నునిచి

కామరాగాది సంకల్ప వర్జనముగా

స్వాంతంబు నరసి నిశ్చలముచేసి

యనిల మానసములతోడ హంసమంత్ర

మమర గూర్చి జపించుచు నంతమీద

హృదయ నభమున బిందువు గదలకుండ

బెంపుగా నాద కళల వీక్షింప వలయు

- సీతారామాంజనేయ సంవాదము

ఇట్లు ధ్యానయోగయుక్తుడై మనస్సును స్వాధీనము చేసికొని యోగి నా యొక్క స్థానము బొందుచున్నాడు.

శ్లో|| ఆరురుక్షో ర్మునే ర్యోగం కర్మ కారణ ముచ్యతే

యోగారూఢస్య తసై#్యవ శమః కారణ ముచ్యతే

గీత 6-3

ముక్తిని పొందుటకు నిష్కామకర్మ సాధన మగును. ముక్తి నొందినవానికి శాంతి కారణ మగును.

సవికల్ప సమాధిలో బాహ్యప్రపంచ జ్ఞానము నశించి దేహము కదలక జడమువలె నుండును.కాని యోగికి తనపై ఎఱుకయుండును. నిర్వికల్ప సమాధి సిద్ధించిన తరువాత జాగ్రదవస్థలోకూడ లైకిక కార్యములు చేయుచున్నప్పటికిని సమాధి యం దుండగలడు.

వేద విహిత కర్మలనగా నెవ్వి?

వేదములందు మీమాంసకులు ప్రశంసించునవియు పశుహింసతో కూడిన అశ్వమేధాది యజ్ఞములు కలవు. వీనిపై శ్రీకృష్ణుని అభిప్రాయమును పరిశీలింతము. ఈ అశ్వమేధాది క్రతువులు స్వర్గప్రాప్తి కలిగించునవి అనేక అర్థవాదములు చెప్పబడినవి. వీని ఉద్దేశ్యము బాధానివృత్తి సుఖప్రాప్తి అయినప్పటికిని స్వర్గాది భోగములు నిత్యములు కావు. ఇట్టి స్వర్గగాము లొనర్చు వైదిక కర్మలనుకూర్చి శ్రీకృష్ణుడిట్లు తెలిపెను.

శ్లో|| యా మిమాం పుష్పితాం వాచం ప్రవదం త్యవిపశ్చితః

వేద వాద రతాః పార్థః నాన్య దస్తీతి వాదినః

శ్లో|| కామాత్మ నః స్వర్గపరా జన్మకర్మ ఫల ప్రదాం

క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి

శ్లో|| భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం

వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధేన విధీయతే.

గీత 2-42, 43, 44

వేదములందు ఫలములను దెలిపెడు అర్థవాదములను నమ్మి స్వర్గమే ఉత్తమ పురుషార్థమని భావించి దానికంటే విశేషఫలము లేదనువారు, పుత్ర మిత్ర కళత్రాదులయందు ఆసక్తి గల అవివేకులు, భోగైశ్వర్య ప్రాప్తికై అనేక కర్మభేదముల చెప్పుదురు. అట్టి మాటలకు మోసపోయి భోగైశ్వర్యములం దాసక్తి పొందినవారికి నిశ్చయాత్మకబుద్ధి కలుగ నేరదు.

మోక్షసాధకుడు వేద విహితములైన సాత్వికకర్మల ననుష్ఠించవలెను. దేవతార్చనము, పరోపకారము, దేహ మనోమాలిన్యములు తొలగించు మంత్రజపాదులు (యజ్ఞ దాన తపః కర్మలు) చేయవలెను.

బ్రహ్మజ్ఞాని కర్మలను చేయవలయునా :-

బ్రహ్మజ్ఞానికి కర్తవ్యములేదు. లోక సంగ్రహార్థము కర్మ చేయవచ్చును. కర్మాసక్తుడు కర్మి అనిపించుకొనును. నిష్కామకర్మ చేయువాడు అకర్మి అనిపించుకొనును.

శ్లో|| అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః

స సన్యాసీ చ యోగీచ ననిరగ్ని ర్నచాక్రియః

గీత 6-1

కర్మఫలాపేక్ష వదలి తనకు నియమితమగు కార్యము నెవడు చేయుచుండునో అతడే సన్యాసి, అతడే యోగి. కేవల కర్మలను వదలినవాడు సన్యాసి కానేరడు. యోగియు కాడు.

శ్లో|| యం సన్యాస మితి ప్రాహుః యోగం తం విద్ధిపాండవ

న్నహ్య సన్న్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన ||

గీత 6-2

దేనిని సన్యాసమని చెప్పుదురో దానిని యోగమని తెలియుము. ఎవడు మనస్సుయొక్క సంకల్పము వదలడో వాడు యోగికాజాలడు. కర్మత్యాగి సన్యాసికాడు. సంకల్ప త్యాగి ఫలాశత్యాగియే సన్యాసి.

శ్లో|| సన్యాసః కరమయోగశ్చ నిశ్శ్రేయస కరా వుభౌ

తయోస్తు కర్మ సన్యాసా త్కర్మయోగో విశిష్యతే.

గీత 5-2

జ్ఞాన కర్మమార్గములు రెండును ముక్తిని గూర్చును. జ్ఞాన మార్గముకన్న నిష్కామ కర్మమార్గమే శ్రేయస్కరము.

శ్లో|| యద్య దాచరతి శ్రేష్ఠః తత్త దేవేతరేజనః

స యత్‌ ప్రమాణం కురుతే లోకస్త దనువర్తతే || గీత 3-21

తెలిసినవా రేత్రోవత్రొక్కుదురో ఇతరులు ఆ మార్గమునే అనుసరింతురు. నీవు నిష్కామకర్మ చేసినయెడల నిన్నాదర్శ పురుషునిగా నెంచినవారును ఆ మార్గముననే నడతురు.

శ్లో|| నమే పార్ధాః స్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన

నానవాప్త మవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. గీత 3-22

నాకొక కోరికతో ప్రయోజనము లేకపోయినను మూడు లోకములయందు నాకు కావలసినది లేకపోయినను నేను కర్మ చేయుచునే యున్నాను.

శ్లో|| లోక సంగ్రహ మేవాపి సంపశ్యన్‌ కర్తు మర్హసి గీత 3-29

లోక సంగ్రహ ముద్దేశించియైనను కర్మ చేయవలయును.

శో|| యది హ్యహం నవర్తేయం జాతు కర్మ ణ్యతంద్రితః

మమ వర్త్మాను పర్తంతే మనుష్యాః పార్థః సర్వశః గీత 3-28

నేను కర్మ చేయక యుందునేని మనుష్యులు నా మార్గమునే అనుసరింతురు.

జ్ఞానికైనను కర్మ నివారించుట అశక్యము.

శ్లో|| నదృశం చేష్టతే స్వ స్యాః ప్రకృతే ర్‌జ్ఞానవానపి

ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి గీత 3-33

జ్ఞానవంతుడైను తన పూర్వజన్మ కర్మను బట్టి ఏర్పడిన స్వభావమునకు తగినట్లు కర్మ చేయుచున్నాడు. ప్రాణులు స్వభావము ననుసరించును. అందులకై కర్మలను చేయక నిరాకరించుట ఎంత మాత్రము లాభకారి కాదు.

శ్లో|| యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం

ఆత్మవంతం నకర్మాణి నిబధ్నంతి ధనంజయ! గీత 4-41

బ్రహ్మజ్ఞాని కర్మలు చేయుచున్నను, అతనికి సంబంధములేదు. వాడు చేయు కర్మలు ప్రపంచోద్ధారమునకేగాని తనకు గాదు. అంత యును భగవంతుని మయమని తెలిసినవానికి సంశయములు లేవు. కర్మలు బంధకములు కావు.

శ్లో|| జ్ఞానేన దీపితే దేహే బుద్ధి బ్రహ్మ సమన్వితమ్‌

బ్రహ్మ జ్ఞానాగ్నినా విద్వాన్‌ నిర్దహే త్కర్మ బంధనమ్‌

- ఉత్తరగీత 2 అధ్యాయము

వివేకియైనవాడు జ్ఞానముచేత శరీరము ప్రకాశమాన మగు చుండగా నిశ్చయాత్మకమైన బుద్ధి బ్రహ్మమును గూడగా బ్రహ్మజ్ఞానమను అగ్నిచేత కర్మపాశమును దహించును.

క|| పరిపక్వాత్మ విమర్శన

పరు లేకర్మలు నొనరుపక యున్నను బా

పరహిత; లాత్మ విమర్శయె

యురు పుణ్యము, బావనముల నొగి బావనమున్‌

- రమణగీత

భగవంతుడు కర్మచే బద్ధుడా :-

మానవునివలె భగవంతుడు కర్మచే బద్ధుడు కాడు.

శ్లో|| అజోపి స న్నవ్యయా త్మా భూతానా మీశ్వరోపిసన్‌

ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మ మాయయా గీత 4-6

శ్లో|| నమాం కర్మణి లింపంతి న మే కర్మఫలే స్పృహా

ఇతి మాం యో7భిజానాతి కర్మభి ర్న స బధ్యతే || గీత 4-14

తనకు కర్మ సంబంధములేదు. స్వేచ్ఛచేతనే పుట్టుచుండును. జీవులు కర్మానుభవమునకై జన్మ లెత్తుదురు. తనకు కర్మఫల అభిలాష లేదు. ఇట్టి నా స్వరూపము తెలిసికొన్నవారు ముక్తి గాంతురు.

శ్లో|| ఉత్సీదేయు రిమే లోకా నకుర్యాం కర్మ చేదహం

సఙ్కరస్యచ కర్తా స్యా ముపహన్యా మిమాః ప్రజాః

గీత 3-24

నేను కర్మ చేయనిఎడల లోకు లెవ్వరు చేయరు. సంకర మేర్పడును. అందులకు నేను కారకుడను కానేల. అందువలన అన్నియు చేయుదును.

''నేను'' ''నాది'' ఉన్నంతవరకు మానవుడు కర్మ చేయవలయునన రమణమహర్షి వచించిరి.

కర్మ నాచరించి సిద్ధి పొందిన వారున్నారా?

శ్లో|| కర్మణౖవహి సంసిద్ధి మాస్థితా జనకాదయః

గీత 3-20

జనకుడు అశ్వపతి మొదలగువారు నిష్కామకర్మచే ముక్తిని గాంచిరి. జనకాదులు వేదాంతులగు కర్మయోగులు. యాజ్ఞవల్క్యాదులు వేదాంతులగు సన్యాసులు. భారతమున జనకుడు సన్యసించెనని చెప్పబడియున్నది.

చాతుర్వర్ణ్య కర్మలచే సిద్ధి లభించునా?

శ్లో|| స్వభావజేన కౌంతేయ! నిబద్ధ స్వేన కర్మణా

కర్తుం నేచ్ఛసి యన్మోహాత్‌ కరిష్య స్యవశోపి తత్‌ గీత 13-69

స్వభావ జన్యగుణములకు లోబడిన నీవు ఎట్టి కర్మ చేయగూడ దని అవివేకముచే నిర్ణయించెదవో అట్టి కర్మ నీకు తెలియకయే నీ స్వభావగుణము నిన్ను మరపుజేసి నీచే చేయించును.

శ్లో|| న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషువా పునః

సత్త్వం ప్రకృతి జైర్ముక్తం యదే భిస్స్యా త్రిభిర్గుణౖః

గీత 18-40

ప్రకృతిచే జనించిన ఈ సత్వాది గుణములకు లోబడని ప్రాణి మనుజలోకమునందు గాని దేవలోకమందు గాని పాతాళలోకమందు గాని లేదు.

శ్లో|| బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాంచ పరంతప!

కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభ##వై ర్గుణౖః

గీత 18-41

ఈ జన్మయందు ఫలదానముకొరకు అభివ్యక్తమైన పూర్వజన్మ కర్మ నంస్కారమే స్వభావము. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులకు కర్మలు స్వభావమునుండి పుట్టిన గుణములచే విభజింపబడినవి.

శ్లో|| స్వేస్వేకర్మ ణ్యభిరత స్సంసిద్ధిం లభ##తే నరః

స్వర్మ నిరత స్సిద్ధిం యథా విన్దతి తచ్ఛృణు

గీత 18-45

ప్రతివాడును కర్మలయం దాసక్తి గలవాడైనచో జ్ఞాన యోగ్యుడగును. తన కర్మను విడువకుండువాడు సిద్ధి నెట్లు బొందుచున్నాడో వినుము.

శ్లో|| యతః ప్రవృత్తి ర్భూతానాం యేన సర్వమిదం తతమ్‌

స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విన్దతి మానవః గీత 18-46

సర్వభూతములకు పుట్టుక మొదలగు వ్యాపార మెవ్వరివలన కలుగుచున్నదో, ఏపరమాత్మ ఈ ప్రపంచమునంతను నిండియున్నాడో అట్టి పరమాత్మను స్వకర్మచే పూజించు మానవుడు సిద్ధి పొందును.

వర్ణాశ్రమ ధర్మములనుండి వృత్తి ఏదైనప్పటికిని విధ్యుక్త కర్మను నిష్కామముగా నిర్వర్తించుటయే ముక్తికి కారణము. దీని కుదాహరణము ధర్మవ్యాధుని కథ.

పై శ్లోకములను బట్టి కర్తవ్యములగు కార్యములను భక్తి శ్రద్ధలతో నిర్వహించి భగవంతున కర్పణజేసినచో సిద్ధి లభించునని తాత్పర్యము. అందులకే క్షత్రియుడగు అర్జునుని స్వధర్మానుసారము యుద్ధము చేయుమనియు భారము భగవంతునిపై యుంచుమనియు గీత తెలిపినది. శ్రీ ఘటికాచల మహాత్మ్యమున నొకకథ కలదు. ఇంద్ర ద్యుమ్నుడను రాజు ఈశ్వరుని చేరగా ''నీవు ఘటికాద్రిలోనున్న నరసింహస్వామిని సేవింపుము. నీకు బ్రాహ్మ్యమోక్షములు సిద్ధించు''నని తెలిపెను. ఇంద్రద్యుమ్నుడు క్షత్రియుడు. అతనికి బ్రాహ్మ్యము సిద్ధించిన గాని మోక్షము లభింపదా? యను ప్రశ్న ఏర్పడును. బ్రాహ్మణ లక్షణము సత్వగుణము. శుద్ధసత్వ మేర్పడినగాని జ్ఞానము లభింపదు. కాన భగవంతుడైన నరహరిని సేవించిన రాజసమైన క్షత్రియధర్మము నశించి సాత్వికమైన బ్రాహ్మ్య మేర్పడును. ''సత్వాత్‌ సంజాయతే జ్ఞానం'' అనుటచేత జ్ఞాన మేర్పడి ముక్తి లభించునని ఈశ్వరుని అభిప్రాయము.

భగవంతుడే సర్వము నడిపించునపుడు నీ వెందుకు కర్మ చేయవలెను. నీకు బాధ్యత కలదా?

శ్లో|| ఈశ్వర స్సర్వ భూతానాం హృద్దేశేర్జున! తిష్ఠతి

భ్రామయన్‌ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా

గీత 18-61

సర్వభూతముల హృదయములయందు ఈశ్వరు డున్నవాడై యంత్రగాడు కీలు బొమ్మను ద్రిప్పునట్లు తన మాయచేత సమస్త భూతముల నాడించుచున్నాడు.

కాబట్టి దైవనిర్ణయముచేత, పూర్వకర్మచేత పనులు జరుగు చున్నఎడల తనకు స్వతంత్రత లేదన వచ్చునుకదా? దీనికి రమణ మహర్షి ఇట్లు బదులు వచించెను. ''దేహాదులు నీవు కావని నిర్ణయించుటకు నీవు స్వతంత్రుడవే కదా?''

భగవద్గీతయందే పై శ్లోకము తరువాత ఇట్లు చెప్పబడినది.

తమేవ శరణం గచ్ఛ సర్బభావేన భారత!

తత్ప్రసాదా త్పరాం ళాంతిం స్థానం ప్రాప్యసి శాశ్వతమ్‌

గీత 18-62

అనగా భగవంతుని శరణుపొందమని మానవునకు చెప్పబడుట చేత కర్తవ్యము సూచింపబడినది. సాధన చేయగా వాసనలడగి ప్రయత్నము ఫలించును. దీనిని పురుషకార మందురు. ఉన్నది శాంతియే. మనోవ్యాపారము సాధనచే పోగొట్టు కొనవలెను. అంతర త్యాగము అనగా వాసన లడగుటయే అనన్య శరణాగతి అనగా ఇతర చింతులు వదలి మనస్సును భగవంతునియందు లగ్నముచేయుట.

దాశరధీ శతకమునందు గోపన్న కర్తృత్వము భగవంతుని పై దోసెను.

గోపన్న తాను ''పాపము లెన్ని యొనర్చినన్‌ జగద్రక్షక కర్త వీవ కదు'' అని చెప్పికొనెను.

భగవద్గీతలో కర్మ చేయువాడు సామ్యబుద్ధితో, సాంఖ్యజ్ఞానము కలవాడై, ప్రేమతో (భక్తితో) కర్తృత్వము ఫలాపేక్షమాని ఈశ్వరార్పణబుద్ధితో కర్మ చేయుమని చెప్పుచున్నది. కర్మ కంటె బుద్ధి శ్రేషము. దోషము బుద్ధి యందున్నదిగాని కర్మయందు లేదు.

శ్లో|| దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ద్ధనంజయ!

గీత 2-49

సమత్వబుద్ధితో కూడిన నిష్కామకర్మకంటె కామ్యకర్మ మిగుల తక్కువైనది.

కర్మ చేయక తప్పదు. జ్ఞానము కలిగిన తరువాతనే కర్మ వదలును.

పుణ్యకర్మ చేయువారి గతి ఏమి?

శ్లో|| ఏషాం త్వస్తగతం పాపం జనానాం పుణ్య కర్మణాం

తే ద్వంద్వ మోహ నిర్ముక్తా భజంతే మాం ధృఢవ్రతాః

గీత 7-23

పుణ్యకర్మలు చేయువారు తమ పాపములు నశించిన తరువాత సుఖదుఃఖాది కారణమగు మోహమును విడనాడి నిశ్చల నియమములు గలిగి నన్ను సేవింతురు.

తుదకు శాస్త్రార్థ సంగ్రహ స్వరూపమును ఈ క్రింది విధముగా ముగించవచ్చును. నిష్కామకర్మవలన భక్తి, భక్తి వలన జ్ఞానము, జ్ఞానమువలన ముక్తి లభించును.

శ్లో|| కర్మణా జాయతే భక్తిః

భక్త్యా జ్ఞానం ప్రజాయతే

జ్ఞానాత్‌ ప్రజాయతే ముక్తిః

ఇతి శాస్త్రార్థ సంగ్రహః

Sri Bhagavadgeetha Madanam-1    Chapters